Monday, December 28, 2009

చేనేతకోసం పూజ

అప్పుల బారినపడి, సదుపాయాలు లేక మన రాష్ట్ర చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం అమెరికాలోని ఒక బాలికను కదిలించింది. వారి దీనావస్థలను ప్రపంచానికి తెలియజెప్పి వారికి అండగా నిలవాలని సంకల్పించింది. ఆమె ఎవరంటే, అమెరికాలోని న్యూజెర్సీలో లివింగ్‌స్టన్ ఉన్నత పాఠశాలలో టెన్త్ గ్రేడ్ విద్యార్థిని. పేరు ఎప్పనపల్లి పూజా జ్యోతి. చేనేత కార్మికుల సంక్షేమం లక్ష్యంగా http://www.saveweavers.org అనే వెబ్‌సైట్ ప్రారంభించింది. దీని ద్వారా లక్ష సంతకాలు సేకరించి, తగిన చర్యల నిమిత్తం వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నది పూజా జ్యోతి లక్ష్యం.

చేనేత కార్మికులు జీవితాలు బాగుపడేందుకుగాను ప్రభుత్వ సంస్థలు, ఆసుపత్రులు, పాఠశాలలు, జైళ్ళు, సైన్యం విధిగా చేనేత ఉత్పత్తులు ధరింపజేసి, ప్రజల్లోనూ ఈ చైతన్యం తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నది జ్యోతి సలహా. ఈ చిన్నారి చేపట్టిన ఈ మహత్కార్యానికి అమెరికా, బ్రిటన్, అస్ట్రేలియాతో బాటు వివిధ దేశాల్లోని ప్రవాస భారతీయులు మద్దతు పలికారు.

పూజకు ఈ ఆలోచన వచ్చినప్పుడు సాఫ్ట్‌వేర్ నిపుణుడైన ఆమె తండ్రి ఇ.హరికిషన్ తన కుమార్తెను ప్రోత్సహించి ముందుకు నడిపించారు. ఆమె చేపట్టిన ఈ "సామాజిక పూజ" ఫలించాలని మనమూ కోరుకుందాం.

Wednesday, December 23, 2009

సలాం తాహెరాబేగం

కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న మహిళలెందరికో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన తాహెరాబేగం జీవితం ఆదర్శప్రాయం. తాహెరాకు చిన్నవయసులోనే పెళ్ళయ్యింది, పుట్టిన పిల్లలిద్దరిలో ఒకరికి చూపులేదు. 22 ఏళ్ళ వయసు వచ్చేసరికి భర్త (లారీ డ్రైవర్) మరణించాడు. ఫలితం, అత్తమామల నిరాదరణ. ఇక చేసేదేమీలేక పుట్టిల్లయిన లక్సెట్టిపేటకు వెళ్ళింది. తాహెరా తండ్రి సంపాదన ఏమంత ఎక్కువకాదు. తన కుమారులతో తండ్రికి భారం కావడం ఇష్టం లేదామెకు. ఇక ఏం చేసింది ? చిన్నతనంలో తాను తండ్రి దగ్గర నేర్చుకున్న టైర్ల మరమ్మతు, రీముల బిగింపు పనుల్నే జీవనాధారంగా చేసుకోవాలని నిర్ణయించుకుంది. సాయం చెయ్యడానికి ఎవరూ ముందుకు రాలేదుగానీ, పుల్లవిరుపు మాటలు బోలెడు ఎదురయ్యాయి. పరదా మధ్య ఉండాల్సిన మహిళ పంక్చర్లు వేయడమేంటని ఎద్దేవా చేశారు. తాహెరా పెద్దకొడుకుకు చూపులేకపోవడంతో కుటుంబ భారం ఆమెపైనే పడింది. ఆలేకుం అస్సలాం తాహెరా...

Tuesday, December 22, 2009

ఎనిమిది గంటలపని

అమెరికాకు చెందిన సుప్రసిద్ధ స్త్రీవాది, సంఘ సంస్కర్త ఆడమ్స్ జేన్. 1860లో జననం, 1935లో మరణం. తన దేశపు మహిళలకోసమేగాక అమెరికాకు వలసవచ్చిన నల్లజాతి స్త్రీలు, చిన్నారుల కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. పీస్ అండ్ బ్రెడ్ ఇన్ టైమ్ ఆఫ్ వార్, డెమొక్రసీ అండ్ సోషల్ ఎథిక్స్ వంటి అద్భుత రచనలు చేసిన ఈమె కృషి ఫలితంగానే స్త్రీలకు ఎనిమిది గంటల పని వ్యవస్థ అమలులోకి వచ్చింది. 1931లో ప్రొఫెసర్ నికాలస్ ముర్రే బట్లర్‌తో కలసి నొబెల్ బహుమతినందుకున్న ఆడమ్స్ జేన్ 1910లో 'నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ సోషల్ వర్క్' తొలి అధ్యక్షరాలిగా పనిచేశారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సెటిల్‌మెంట్స్ స్థాపనకు చేయూతనిచ్చిన జేన్, నేషనల్ అమెరికన్ ఉమెన్ సఫరేజ్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు. శాంతి, స్వేచ్ఛ కోసం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా సంస్థకు కొంతకాలం నేతృత్వం వహించారు.

Friday, November 27, 2009

భర్తతో ఒప్పందం

అమెరికాకు చెందిన ప్రముఖ స్త్రీవాది కాట్ కారీ (క్లింటన్) ఛాప్‌మాన్. 1859లో జన్మించిన ఈ స్త్రీమూర్తి బాధిత స్త్రీల కోసం శ్రమించిన సంఘసంస్కర్త. అమెరికాలో మొదటి మహిళా పాఠశాల సూపరింటెండెంట్‌లలో ఈమె ఒకరు. 1884లో ఈమె లియో చాంప్‌మెన్ అనే వ్యక్తిని పెళ్లాడారు. అతను అకాలమరణం చెందడంతో కాట్ కారీ 1890లో జార్జి డబ్ల్యూ కాట్‌ను వివాహమాడారు. అయితే ఈ పెళ్ళికి ముందు ఆమె తన భర్తకు కొన్ని షరతులు విధించారు. సంవత్సరంలో నాలుగు నెలల పాటు మహిళా సమస్యల పరిష్కారానికి తనను అనుమతించాలన్నది అందులో ఒకటి. ఈ రెండవ భర్త తాను తుది శ్వాస విడిచేవరకూ ఇందుకు కట్టుబడి ఉన్నాడు. 1890లో ఈమె నేషనల్ అమెరికన్ ఉమెన్ సఫరేజ్ అసోసియేషన్ సభ్యురాలిగా చేరారు. తర్వాత అధ్యక్ష స్థానానికి ఎదిగారు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఉమెన్ సఫరేజ్ ఎలియన్స్‌ను నెలకొల్పారు. 1919లో రెండు మిలియన్ల మహిళా ఓటర్లతో ఒక పటిష్ఠమైన సంస్థను ఏర్పాటు చేశారు. ప్రపంచశాంతికి తన వంతు కృషిచేసిన కాట్ కారీ మహిళాలోకానికి చిరస్మరణీయురాలు.

Thursday, November 26, 2009

బాలల అయ్య-మ్మ

బెంగళూరు కె ఆర్ మార్కెట్ సమీపానగల ఒక మురికివాడ వాసి 21 సంవత్సరాల అయ్యమ్మ. మూడేళ్ళప్పుడు తండ్రి చనిపోయాడు. తొమ్మిదేళ్ళ వయసునుంచే ఒక గిడ్డంగిలో పెట్టెలు మోసే పనిచేసేది. తర్వాత బట్టల దుకాణంలో పని చేస్తూ సాయంత్రం వేళల్లో పేద విద్యార్థులకు పాఠాలు చెబుతుంది. ఆ సమయంలో బాల కార్మికుల హక్కులపై పోరాడే ఒక స్వచ్ఛంద సంస్థ ఊతమివ్వడంతో అయ్యమ్మ తన ప్రతిభా పాటవాలు కనబరచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. బాలల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఏర్పాటు చేసిన కమిటీకి సలహాదారుగా వ్యవహరించిన అయ్యమ్మ మన దేశంలో బాలలపై చోటుచేసుకుంటున్న హింసాకాండపై అప్పటి ఐరాస ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్‌ను నేరుగా కలుసుకుని నివేదిక సమర్పించింది. నార్వే దేశంలో 2004 జూన్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో ఈమె పాల్గొని ప్రసంగించింది. 2005 జూన్‌లో బాలలపై హింసను వ్యతిరేకిస్తూ జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొంది. అయ్యమ్మ విజయాలను ప్రశంసిస్తూ ఈమె జీవితంపై ఐక్యరాజ్య సమితి ఒక లఘుచిత్రం నిర్మించింది. ప్రపంచవ్యాప్తంగా ఐదుగురు బాలల జీవితాలపై తీసిన డాక్యుమెంటరీల్లో (2006 నాటికి) ఆసియా ఖండంలో అయ్యమ్మపై మాత్రమే లఘుచిత్రాన్ని నిర్మించారు.

Thursday, October 29, 2009

బడికి పంపరా... ఖబడ్దార్

అనితకు చదువంటే పంచప్రాణాలు. విద్యతో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని నమ్మిన ఈ 12 ఏళ్ళ చిన్నారి. తల్లిదండ్రులు పేదవారు. కానీ వాళ్ళ దృష్టి ఎంతసేపూ అనితను ఆమె మేనమామ అన్నామలైకిచ్చి పెళ్ళి చెయ్యడం పైనే. అనిత మాత్రం ఇందుకు ససేమిరా అనేది. కానీ పెళ్ళి చేసుకుంటే బడికి పంపిస్తామని ఆమెను ఎలాగో మభ్యపెట్టి అన్నామలై చేత మూడుముళ్ళూ వేయించారు. పెళ్ళి తతంగం పూర్తయ్యింది. నేనింక బడికెళ్ళనా ? అని అమాయకంగా అడిగింది. 'ఇంకేం బడి... అత్తగారిల్లే బడి, గుడి' అన్నారంతా. వారి మాటలు అనిత పట్టించుకోకపోవడంతో ఆమెను తిట్టారు, కొట్టారు. వీళ్ళ సంగతి ఇలా కాదని ఆమె పోలీసులను ఆశ్రయించి తనను చదివించాలని కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు వచ్చారు. అప్పటికే ఆమెను బాల్యవివాహం చేసుకున్న మేనమామ పిక్కబలం చూపించి పారిపోయాడు. కుటుంబ సభ్యులు అజా పజా లేరు. అనితా మజాగా...

సీతారావమ్మ గురించి తెలుసా ?

ఆమె చదువుకుంది వీధి బడిలోనే... అదీ మూడో తరగతి దాటలేదు. అయినా... తన ఊరిని చదువులమ్మ ఒడిగా, సరస్వతి గుడిగా మార్చారు 80 ఏళ్ళు పైబడిన ఉల్చి సీతారావమ్మ. తన ఆస్తిలో ఎక్కువ భాగాన్ని మహిళా విద్య కోసం సమర్పించి మానవీయ విలువలు మూర్తీభవించిన నారీమణిగా ప్రశంసలందుకున్నారు. స్త్రీలకు చదువెందుకని ప్రశ్నించిన రోజుల్లోనే తన భర్త వెంకారెడ్డి సహాయంతో స్త్రీలకు ప్రత్యేకంగా విద్యా సంస్థ నెలకొల్పారీమె. బడి మానేసిన చిన్నారుల కోసం తన ఇంట్లోనే వారి విద్యాభ్యాసానికి తోడ్పాటునిచ్చారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలో మహిళా పాలిటెక్నిక్ కళాశాల నిర్మించారు. ఇందుకోసం తమ స్వంత భవనాన్ని, స్థలాన్ని ఉచితంగా ఇచ్చేశారు. మరికొన్నాళ్ళకు దీని విస్తరణ నిమిత్తం మరో 2 లక్షలు, పదెకరాల భూమి ఇచ్చారు. మహిళలకు వసతిగృహ సదుపాయంతో పాటు ఎన్నో రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న ఎందరో మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకుని మరిందరికి ఆదర్శంగా నిలిచారు. నాడు డొక్కా సీతమ్మ అన్నదానంతో ఆంధ్రుల దాతృత్వానికి ప్రతీకగా నిలిచారు. నేడు విద్యాదానంతో ఈ సీతారావమ్మ తెలుగువారి ఔదార్యానికి దర్పణమై ప్రకాశించారు.