విశాఖపట్టణంలోని శ్రీహరిపురంలో ఉండే నాగమణి రోడ్డెక్కితే చాలు ఇక ఆ బీట్‌లో డ్యూటీ పడిన ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌కి కొండంత భారం నెత్తిమీదనుంచి దింపినట్లే... 65 ఏళ్ళు పైబడిన నాగమణి విజిల్ చేతబూని ఉదయం 7 గంటలకు రోడ్డుపై కనిపిస్తే చాలు అటుగా వెళ్ళే ఆకతాయిలు, యమ స్పీడుగా వాహనాలు నడిపే చోదకులు, సామర్థ్యానికి మించి జనాన్ని కుక్కే ఆటో డ్రైవర్లు రూట్ మార్చుకోవలసిందే. అదీ నాగమణి సత్తా. సాయంత్రం వేళల్లో గాజువాక సెంటర్లోను, అర్థరాత్రి వేళల్లో ఎక్స్‌సర్వీస్‌మెన్ కాలనీలో గస్తీ తిరుగుతూ దొంగల పాలిట అపరా కాళిలా కనిపిస్తారీమె.
విశాఖలో జరిగే పలు ఉత్సవాలు, వేడుకల్లో జేబు దొంగల భరతం పట్టేందుకు స్థానికులు, అధికార్లు నాగమణి సేవలు వినియోగించుకుంటుంచారు. ఈమె సేవలకు గుర్తుగా పలు పురస్కారాలు, అవార్డులు వరించాయి.
మిలట్రీ ఉద్యోగి అయిన తన భర్త పాపారావు ప్రోత్సాహంతో నాగమణి సామాజిక సేవలోకి ప్రవేశించారు. ఆయన మరణానంతరం నేవల్ పబ్లిక్ స్కూల్‌లో పనిచేసిన నాగమణి పాముకాటు, కరెంట్ షాక్‌కు గురైన ఎందరో స్త్రీలను కాపాడారు.
మైత్రీ సంఘం సభ్యురాలైన నాగమణి స్వచ్ఛందంగా తన సేవలు చేస్తుంటారు. కేవలం ట్రాఫిక్ నియంత్రణ ఒక్కటేకాదు. భార్యాభర్తల మధ్య తగవులు పోలీస్ స్టేషన్ వరకూ రాకుండా రాజీ చేసి కాపురాలు నిలబెడుతుంటారీమె. ఉద్యోగాలిప్పిస్తామని మోసాలకు పాల్పడేవారిని, నోపార్కింగ్ బోర్డున్న చోట బళ్ళు పెట్టేవారినీ వదలరీమె.
ఆపదలో ఉన్నవారికి చింతామణి మన నాగమణి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment