దేశరాజధాని ఢిల్లీలో ఉన్న అద్భుత రాష్ట్రపతి భవన్ గదులు ఆరేళ్ళ బాలిక సర్జానా ఔదార్యం ముందు తలవంచాయి. రైలు బోగీల్లో పాటలు పాడి తన చిట్టి చేతులతో ఆర్జించిన 205 రూపాయల మొత్తాన్ని ఈమె మార్చి 18, 2010వ తేదీన ప్రధానమంత్రి సహాయనిధికి చెక్కు రూపంలో అందజేసింది.
పశ్చిమబెంగాల్‌లో సంభవించిన ఐలా తుపాను పలు గ్రామాలలో బీభత్సం సృష్టించింది. చిన్నారి సర్జానా స్వగ్రామం కూడా వాటిలో ఒకటి. ఈ వైపరీత్యాన్ని కళ్ళారా చూసిన ఆ బాలిక హృదయం ద్రవించింది. తనవల్ల సాధ్యమైన మార్గంలో ఈ తుపాను బాధితుల్ని ఆదుకోవాలని నిర్ణయించుకుంది. మరి డబ్బులు సంపాదించేందుకు తన ముందున్న మార్గమేంటీ? చివరికి పాటలు పాడి, డాన్స్ చేసి సాధ్యమైనంత మొత్తం కూడబెట్టాలని నిశ్చయించుకుంది
ఈ చిన్నపిల్ల తన తల్లి బాణీలు కట్టిన పాటలను బాసిర్లాట్ - హృదయపూర్ స్టేషన్ల మధ్య నడిచే రైలు బళ్ళలో ప్రయాణీకుల వద్ద పాడి తుపాను బాధితులకోసం డబ్బు సేకరించింది. ఇలా తన పాటల ద్వారా సేకరించిన మొత్తాన్ని బెంగాల్ గవర్నర్‌కు సహాయక కార్యక్రమాల కోసం సమర్పించింది.
సర్జానా ఔదార్యం గురించి తెలుసుకున్న మన దేశాధ్యక్షురాలు ప్రతిభాపాటిల్ ఈమెను స్వయంగా తనను కలవాల్సిందిగా కబురుపంపారు. దేశాధ్యక్షురాలితో సమావేశమైనప్పుడు సర్జానా ఆమెకు 205 రూపాయల చెక్కును అందజేసి ప్రధానమంత్రి సహాయకనిధికి ఇవ్వాలని కోరింది. అనంతరం సర్జానా చదువు కోసం దేశాధ్యక్షురాలు ఆమెకు రూ 10,000 కానుకగా ఇచ్చారు.
తుపాను సృష్టించిన విధ్వంసాన్ని చూసి తనకు బాధగా అనిపించిందని, తనకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టమని, అందువల్ల పాటలు పాడి ఎవరెంతిచ్చినా డబ్బులు తీసుకున్నానని దేశాధ్యక్షురాలితో సమావేశమైన తర్వాత సర్జానా వివరాలు చెప్పింది. మంచిపనులు చేయాలని ప్రతిభా పాటిల్ తనకు చెప్పారని, తనకు చాక్‌లెట్లు కూడా ఇప్పించారని విప్పారిన మోముతో తెలిపింది.
సర్జానా తండ్రి కోల్‌కతా నగరంలో సామాను అమ్మి జీవిస్తుంటారు. తల్లి ఇంటి బాధ్యతలు నిర్వహిస్తుంటారు. ఈమె అమ్మ బిస్వాస్ మాట్లాడుతూ తన కుమార్తె ఈ స్ఫూర్తిని ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటునట్లు చెప్పారు. కూతురి కోసం కొన్ని పాటలకు తాను బాణీలు కట్టానని రైళ్లలో అవి పాడి ఆమె నాట్యం చేసి ప్రయాణికుల నుంచి విరాళాలు సేకరణ చేసేదని తెలియజేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment