మన సమాజంలో ఆడపిల్లల హక్కుల విషయంలో వేళ్ళూనుకుని ఉన్న మూసపద్ధతులకు వ్యతిరేకంగా ఉద్యమించి, ఈ చిన్నారుల విలువైన జీవితాలపై ప్రజాభిప్రాయాన్ని కడగట్టగలిగే ఉత్తమ ప్రచురణలు, ప్రసారాలకు "లాడ్లీ" మీడియా అవార్డుల్ని అందించేందుకు యుఎన్‌పిఎఫ్ (United Nations Population Fund), ముంబైకి చెందిన పాపులేషన్ ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా ముందుకొచ్చాయి.
ఆడ శిశువులను అంతమొందించే విష సంస్కృతిని... కూకటి వేళ్లతో పెకిలించేందుకు... ఐరాస పాపులేషన్ ఫండ్, పాపులేషన్ ఫస్ట్ సంస్థలు నడుం బిగించాయి. ఆ దిశగా కృషి చేసే వారిని సత్కరించేందుకు... జాతీయ స్థాయిలో 'లాడ్లీ మీడియా అవార్డు'లను నెలకొల్పాయి.
బాలికల పట్ల కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా వస్తున్న ప్రచురణలు, దృశ్య శ్రవణ ప్రసారాలు, వార్తా కథనాలు, పత్రికా సంపాదకీయాలు, ప్రకటనలకు ఏటా ఈ అవార్డుల్ని అందజేస్తున్నారు. మార్చి 2007లో నెలకొల్పిన లాడ్లీ అవార్డులకు దక్షిణ భారతంలో పర్యవేక్షణ బాధ్యతల్ని "భూమిక" చేపట్టింది. (మహిళల హక్కులు, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న 'భూమిక హెల్ప్‌లైన్' వ్యవస్థాపకురాలు కొండవీటి సత్యవతి 2008 సంవత్సరానికి గాను ఈ లాడ్లీ మీడియా అవార్డు గెలుచుకున్నారు. 'భూమిక'లో సంపాదకీయానికి ఆ అవార్డు లభించింది.)
'లాడ్లీ' అంటే ప్రియమైన అనీ... నవ్వుల పాపాయి అనీ అర్థం. అలాంటి అమ్మాయిని, గారాలపట్టిని పుట్టకముందే చంపేయకుండా... ఆనందమైన జీవితాన్ని అందించమంటూ... ఐరాస పాపులేషన్ ఫండ్ కొన్నేళ్లుగా ప్రచారం చేస్తోంది. దేశవ్యాప్తంగా చైతన్యం తెచ్చే దిశలో వడివడిగా నడక సాగిస్తోంది. 'స్త్రీ సమస్యలపై ప్రతిఘటించాలి.. పోరాడాలి.. బాలికల సంఖ్య పెంచాలి' అంటూ పిలుపునిస్తోంది. అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాల్లో పొట్టలో ఉన్నది అమ్మాయా లేదా అబ్బాయా అని చెప్పడం నేరమంటూ బోర్డులు పెట్టడమే కాదు... వైద్యుల నుంచి నర్సుల దాకా ప్రతి ఒక్కరూ ఆ నియమాన్ని కచ్చితంగా పాటించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఆడయినా, మగయినా... అమ్మానాన్నలకు ముద్దుబిడ్డలే అంటూ ప్రచారం నిర్వహిస్తోంది.
ఈ స్ఫూర్తిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే పత్రికలు, ప్రసార మాధ్యమాలు, వాటిల్లో పనిచేసే విలేకరులను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యమిస్తోంది. ఆ క్రమంలో ఏర్పాటు చేసినవే లాడ్లీ మీడియా అవార్డులు. కేవలం మీడియా వారే కాదు, భ్రూణ హత్యల నివారణకు ఆడ శిశువుల సంరక్షణకు కృషిచేసే సంస్థలు సైతం ఎంట్రీలు పంపవచ్చు. ఇటు కుటుంబంలో అటు సమాజంలో బాలికల హక్కుల్ని గుర్తిస్తూ జండర్ అవగాహనతో రచనలు చేస్తున్న వారికి కూడా అవార్డు ఇచ్చి గౌరవిస్తుంది. ఉత్తమ వార్తాకధనాలు, సంపాదకీయాలు, ఫీచర్స్ పోటీ పరిధిలోకి వస్తాయి. ప్రచార, ప్రసార, వెబ్‌సైట్ మాధ్యమాల్లో పని చేస్తున్న విలేకరులు తమ ఎంట్రీలని పంపవచ్చు. లింగ నిర్ధారణ పరీక్షల్ని వ్యతిరేకించే ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి లాడ్లీ పురస్కార గ్రహీతల్ని ఎంపిక చేస్తారు
ఎంట్రీ ఫారాల కోసం శ్రీమతి కొండవీటి సత్యవతి (భూమిక) గారిని, హెచ్ ఐ జి II, బ్లాక్ 8, ఫ్లాట్ 1, బాగలింగంపల్లి, హైదరాబాద్-44 చిరునామాలో సంప్రదించవచ్చు. ఫోన్: 040-27660173. ఇతర వివరాలు, దరఖాస్తు పత్రాల్ని ఆన్‌లైన్‌లో www.papulationfirst.org మరియు http://bhumika.org నుంచి కూడా పొందవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment