Friday, December 30, 2011

బితిక బడికి వెళుతోంది..

కోల్‌కత నగరంలోని ఒక సర్కారీ బడిలో 6వ తరగతి చదువుతోంది పేదింటి బాలిక బితికా నయాబన్. తను బాగా చదువుకుని తమ కుటుంబాన్ని మంచి స్థితిలో ఉంచాలనేది ఆమె తపన. ఈమె అమ్మా.. నాన్న మాత్రం ఈ చిన్నారికి పెళ్ళిచేసి చేతులు దులుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజున ఆయిల్ మిల్లులో పనిచేసే ఒకతనితో నీ పెళ్ళంటూ ఆమె చేత బడికి ఎగనామం పెట్టించారు. డిసెంబర్ 14, 2011న పెళ్ళి జరగాల్సి ఉంది. డిసెంబర్ 13న బితిక తన స్నేహితురాలిని పిలిపించింది. తనకు పెళ్ళి చేస్తున్నారని, తన యూనిఫారం, పుస్తకాల్ని ఎవరైనా పేదమ్మాయికి ఇమ్మని చెప్పి పంపించింది. తాను ఎంతో ప్రేమించే చదువు మానుకోవాల్సిన పరిస్థితిలో కూడా మరో పేదమ్మాయికి తన యూనిఫారం, పుస్తకాలు ఇవ్వాలని కోరడం ద్వారా బితిక తన ఔదార్యాన్ని చాటుకుంది.

ఈ స్నేహితురాలు బితిక గురించి తన బడి ప్రధానోపాధ్యాయుడికి చెప్పింది. అప్పటికే బితిక ఎందుకు బడికి రావడంలేదంటూ ఆరా మొదలైంది. ఈ బడి ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోంది. సంస్థవారు కూడా బితిక స్నేహితురాలు, ప్రధానోపాధ్యాయుని నుంచి వివరాలు అందుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఈ బడిలోని ఉపాధ్యాయులంతా బితిక ఇంటికి పరుగులు తీశారు. అంతా కలిసి ఆమె తల్లిదండ్రుల్ని ఒప్పించారు. అమ్మాయి చదువుకు తాము తోడై నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇంకేముంది బితిక బడిబాట పట్టింది.

Sunday, December 12, 2010

ఆవిడ.. రసాయన కంపెనీలకు రాక్షసి

రాచెల్ లూయిస్ కార్సన్... ఈ పేరు వింటే పశువులు, పక్షులు పులకించిపోతాయి. చెట్లు చేమలు చెంగు చెంగున గెంతుతాయి. చెరువులు, కాల్వలు ఉప్పొంగిపోతాయి. కొండా కోనా పరవశంతో ప్రతిధ్వనిస్తాయి. నేస్తమా బాగున్నావా? ఆంటూ పల్లెలన్నీ కుశల ప్రశ్నలు వేస్తాయి. ఎందుకంటారా ? పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రపంచాన్ని ప్రేరేపించి ముందుకు నడిపించిన "సైలెంట్ స్ప్రింగ్" పుస్తకాన్ని రచించిన సుప్రసిద్ధ రచయిత్రి ఈమే కనుక.

రాచెల్ 1907 మే 27న పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఒక కుగ్రామంలో పుట్టారు. అలెగనీ నదీ తీరాన ప్రకృతి ఒడిలో పెరిగారు. పచ్చిక బయళ్ళు, అడవులు, పశుపక్ష్యాదులు ఆమెకు ప్రాణమై నిలిచాయి. పేదరికాన్ని జయించి ఉన్నత విద్య అభ్యసించారు. డాక్టరేట్ సాధించి అమెరికా సివిల్స్ పరీక్షల్లోనూ ఉత్తీర్ణురాలై మత్స్యశాఖలో చేరారు.

మెరైన్ బయాలజిస్ట్ అయిన రాచెల్ లూయిస్ కార్సన్ రాసిన "సైలెంట్ స్ప్రింగ్" (మౌనవసంతం) పుస్తకం విషయానికి వస్తే... రసాయన కంపెనీలు ఉత్పత్తి చేసే పురుగుల మందుల వల్ల పర్యావరణానికి, మానవాళికి ఎంతటి ప్రమాదం ముంచుకొస్తుందనేది దాని సారాంశం. రసాయన కంపెనీలు ఆమెను రాక్షసిగా అభివర్ణించాయి. అప్పటికే పురుగుల మందుల వినియోగంపై ఒక విధానాన్ని ప్రకటించిన అమెరికా ప్రభుత్వం వెనక్కి తగ్గి దానిని ఉపసంహరించుకుంది.

రాచెల్ పై కక్షగట్టిన రసాయన కంపెనీలు కోర్టుల్లో కేసులు వేశాయి. వాటన్నిటినీ జయించారు రాచెల్. రాచెల్ మాటలు వింటే దేశాలన్నీ అంధకారంలోకి వెళతాయని, ప్రపంచమంతా పురుగులమయం అవుతుందని రసాయన కంపెనీలు దుష్ప్రచారం చేశాయి. అయితే రాచెల్ పుస్తకంలోని వాస్తవాల్ని, ఆమె వాదనను అర్థం చేసుకున్న నాటి సభ్య సమాజంలోని మేధావులు, విద్యావంతులు ఆమె వెంట నిలిచి గెలిపించారు.

ప్రకృతి మాత సేవలో తరించిన రాచెల్ 1964, ఏప్రిల్ 14 మరణించారు. 2007లో వీరి శతజయంతి వేడుకలు జరిగాయి.

Monday, November 29, 2010

తుపాను గాయం... స్వరంతో సాయం

దేశరాజధాని ఢిల్లీలో ఉన్న అద్భుత రాష్ట్రపతి భవన్ గదులు ఆరేళ్ళ బాలిక సర్జానా ఔదార్యం ముందు తలవంచాయి.  రైలు బోగీల్లో పాటలు పాడి తన చిట్టి చేతులతో ఆర్జించిన 205 రూపాయల మొత్తాన్ని ఈమె మార్చి 18, 2010వ తేదీన ప్రధానమంత్రి సహాయనిధికి చెక్కు రూపంలో అందజేసింది.

పశ్చిమబెంగాల్‌లో సంభవించిన ఐలా తుపాను పలు గ్రామాలలో బీభత్సం సృష్టించింది. చిన్నారి సర్జానా స్వగ్రామం కూడా వాటిలో ఒకటి. ఈ వైపరీత్యాన్ని కళ్ళారా చూసిన ఆ బాలిక హృదయం ద్రవించింది. తనవల్ల సాధ్యమైన మార్గంలో ఈ తుపాను బాధితుల్ని ఆదుకోవాలని నిర్ణయించుకుంది. మరి డబ్బులు సంపాదించేందుకు తన ముందున్న మార్గమేంటీ? చివరికి పాటలు పాడి, డాన్స్ చేసి సాధ్యమైనంత మొత్తం కూడబెట్టాలని నిశ్చయించుకుంది

ఈ చిన్నపిల్ల తన తల్లి బాణీలు కట్టిన పాటలను బాసిర్లాట్ - హృదయపూర్ స్టేషన్ల మధ్య నడిచే రైలు బళ్ళలో ప్రయాణీకుల వద్ద పాడి తుపాను బాధితులకోసం డబ్బు సేకరించింది.  ఇలా తన పాటల ద్వారా సేకరించిన మొత్తాన్ని బెంగాల్ గవర్నర్‌కు సహాయక కార్యక్రమాల కోసం సమర్పించింది.

సర్జానా ఔదార్యం గురించి తెలుసుకున్న మన దేశాధ్యక్షురాలు ప్రతిభాపాటిల్  ఈమెను స్వయంగా తనను కలవాల్సిందిగా కబురుపంపారు. దేశాధ్యక్షురాలితో సమావేశమైనప్పుడు సర్జానా ఆమెకు 205 రూపాయల చెక్కును అందజేసి ప్రధానమంత్రి సహాయకనిధికి ఇవ్వాలని కోరింది. అనంతరం సర్జానా చదువు కోసం దేశాధ్యక్షురాలు ఆమెకు రూ 10,000 కానుకగా ఇచ్చారు.

తుపాను సృష్టించిన విధ్వంసాన్ని చూసి తనకు బాధగా అనిపించిందని, తనకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టమని, అందువల్ల పాటలు పాడి ఎవరెంతిచ్చినా డబ్బులు తీసుకున్నానని దేశాధ్యక్షురాలితో సమావేశమైన తర్వాత సర్జానా వివరాలు చెప్పింది. మంచిపనులు చేయాలని ప్రతిభా పాటిల్ తనకు చెప్పారని, తనకు చాక్‌లెట్లు కూడా ఇప్పించారని విప్పారిన మోముతో తెలిపింది.

సర్జానా తండ్రి  కోల్‌కతా నగరంలో సామాను అమ్మి జీవిస్తుంటారు. తల్లి ఇంటి బాధ్యతలు నిర్వహిస్తుంటారు. ఈమె అమ్మ బిస్వాస్ మాట్లాడుతూ తన కుమార్తె ఈ స్ఫూర్తిని ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటునట్లు చెప్పారు. కూతురి కోసం కొన్ని పాటలకు తాను బాణీలు కట్టానని రైళ్లలో అవి పాడి ఆమె నాట్యం చేసి ప్రయాణికుల నుంచి విరాళాలు సేకరణ చేసేదని తెలియజేశారు.

Wednesday, October 27, 2010

నాగమణి.... భద్రతా శిఖామణి

విశాఖపట్టణంలోని శ్రీహరిపురంలో ఉండే నాగమణి రోడ్డెక్కితే చాలు ఇక ఆ బీట్‌లో డ్యూటీ పడిన ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌కి కొండంత భారం నెత్తిమీదనుంచి దింపినట్లే... 65 ఏళ్ళు పైబడిన నాగమణి విజిల్ చేతబూని ఉదయం 7 గంటలకు రోడ్డుపై కనిపిస్తే చాలు అటుగా వెళ్ళే ఆకతాయిలు, యమ స్పీడుగా వాహనాలు నడిపే చోదకులు, సామర్థ్యానికి మించి జనాన్ని కుక్కే ఆటో డ్రైవర్లు రూట్ మార్చుకోవలసిందే. అదీ నాగమణి సత్తా. సాయంత్రం వేళల్లో గాజువాక సెంటర్లోను, అర్థరాత్రి వేళల్లో ఎక్స్‌సర్వీస్‌మెన్ కాలనీలో గస్తీ తిరుగుతూ దొంగల పాలిట అపరా కాళిలా కనిపిస్తారీమె.

విశాఖలో జరిగే పలు ఉత్సవాలు, వేడుకల్లో జేబు దొంగల భరతం పట్టేందుకు స్థానికులు, అధికార్లు నాగమణి సేవలు వినియోగించుకుంటుంచారు. ఈమె సేవలకు గుర్తుగా పలు పురస్కారాలు, అవార్డులు వరించాయి.

మిలట్రీ ఉద్యోగి అయిన తన భర్త పాపారావు ప్రోత్సాహంతో నాగమణి సామాజిక సేవలోకి ప్రవేశించారు. ఆయన మరణానంతరం నేవల్ పబ్లిక్ స్కూల్‌లో పనిచేసిన నాగమణి పాముకాటు, కరెంట్ షాక్‌కు గురైన ఎందరో స్త్రీలను కాపాడారు.

మైత్రీ సంఘం సభ్యురాలైన నాగమణి స్వచ్ఛందంగా తన సేవలు చేస్తుంటారు. కేవలం ట్రాఫిక్ నియంత్రణ ఒక్కటేకాదు. భార్యాభర్తల మధ్య తగవులు పోలీస్ స్టేషన్ వరకూ రాకుండా రాజీ చేసి కాపురాలు నిలబెడుతుంటారీమె. ఉద్యోగాలిప్పిస్తామని మోసాలకు పాల్పడేవారిని, నోపార్కింగ్ బోర్డున్న చోట బళ్ళు పెట్టేవారినీ వదలరీమె.

ఆపదలో ఉన్నవారికి చింతామణి మన నాగమణి.

Tuesday, October 26, 2010

స్త్రీ చైతన్యదీపం... లాడ్లీ పురస్కారం

మన సమాజంలో ఆడపిల్లల హక్కుల విషయంలో వేళ్ళూనుకుని ఉన్న మూసపద్ధతులకు వ్యతిరేకంగా ఉద్యమించి, ఈ చిన్నారుల విలువైన జీవితాలపై ప్రజాభిప్రాయాన్ని కడగట్టగలిగే ఉత్తమ ప్రచురణలు, ప్రసారాలకు "లాడ్లీ" మీడియా అవార్డుల్ని అందించేందుకు యుఎన్‌పిఎఫ్ (United Nations Population Fund), ముంబైకి చెందిన పాపులేషన్ ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా ముందుకొచ్చాయి.

ఆడ శిశువులను అంతమొందించే విష సంస్కృతిని... కూకటి వేళ్లతో పెకిలించేందుకు... ఐరాస పాపులేషన్‌ ఫండ్‌, పాపులేషన్‌ ఫస్ట్‌ సంస్థలు నడుం బిగించాయి. ఆ దిశగా కృషి చేసే వారిని సత్కరించేందుకు... జాతీయ స్థాయిలో 'లాడ్లీ మీడియా అవార్డు'లను నెలకొల్పాయి.

బాలికల పట్ల కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా వస్తున్న ప్రచురణలు, దృశ్య శ్రవణ ప్రసారాలు, వార్తా కథనాలు, పత్రికా సంపాదకీయాలు, ప్రకటనలకు ఏటా ఈ అవార్డుల్ని అందజేస్తున్నారు. మార్చి 2007లో నెలకొల్పిన లాడ్లీ అవార్డులకు దక్షిణ భారతంలో పర్యవేక్షణ బాధ్యతల్ని "భూమిక" చేపట్టింది. (మహిళల హక్కులు, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న 'భూమిక హెల్ప్‌లైన్‌' వ్యవస్థాపకురాలు కొండవీటి సత్యవతి 2008 సంవత్సరానికి గాను ఈ లాడ్లీ మీడియా అవార్డు గెలుచుకున్నారు. 'భూమిక'లో సంపాదకీయానికి ఆ అవార్డు లభించింది.)

'లాడ్లీ' అంటే ప్రియమైన అనీ... నవ్వుల పాపాయి అనీ అర్థం. అలాంటి అమ్మాయిని, గారాలపట్టిని పుట్టకముందే చంపేయకుండా... ఆనందమైన జీవితాన్ని అందించమంటూ... ఐరాస పాపులేషన్‌ ఫండ్‌ కొన్నేళ్లుగా ప్రచారం చేస్తోంది. దేశవ్యాప్తంగా చైతన్యం తెచ్చే దిశలో వడివడిగా నడక సాగిస్తోంది. 'స్త్రీ సమస్యలపై ప్రతిఘటించాలి.. పోరాడాలి.. బాలికల సంఖ్య పెంచాలి' అంటూ పిలుపునిస్తోంది. అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ కేంద్రాల్లో పొట్టలో ఉన్నది అమ్మాయా లేదా అబ్బాయా అని చెప్పడం నేరమంటూ బోర్డులు పెట్టడమే కాదు... వైద్యుల నుంచి నర్సుల దాకా ప్రతి ఒక్కరూ ఆ నియమాన్ని కచ్చితంగా పాటించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఆడయినా, మగయినా... అమ్మానాన్నలకు ముద్దుబిడ్డలే అంటూ ప్రచారం నిర్వహిస్తోంది.

ఈ స్ఫూర్తిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే పత్రికలు, ప్రసార మాధ్యమాలు, వాటిల్లో పనిచేసే విలేకరులను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యమిస్తోంది. ఆ క్రమంలో ఏర్పాటు చేసినవే లాడ్లీ మీడియా అవార్డులు. కేవలం మీడియా వారే కాదు, భ్రూణ హత్యల నివారణకు ఆడ శిశువుల సంరక్షణకు కృషిచేసే సంస్థలు సైతం ఎంట్రీలు పంపవచ్చు. ఇటు కుటుంబంలో అటు సమాజంలో బాలికల హక్కుల్ని గుర్తిస్తూ జండర్‌ అవగాహనతో రచనలు చేస్తున్న వారికి కూడా అవార్డు ఇచ్చి గౌరవిస్తుంది. ఉత్తమ వార్తాకధనాలు, సంపాదకీయాలు, ఫీచర్స్ పోటీ పరిధిలోకి వస్తాయి. ప్రచార, ప్రసార, వెబ్‌సైట్‌ మాధ్యమాల్లో పని చేస్తున్న విలేకరులు తమ ఎంట్రీలని పంపవచ్చు. లింగ నిర్ధారణ పరీక్షల్ని వ్యతిరేకించే ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి లాడ్లీ పురస్కార గ్రహీతల్ని ఎంపిక చేస్తారు

ఎంట్రీ ఫారాల కోసం శ్రీమతి కొండవీటి సత్యవతి (భూమిక) గారిని, హెచ్ ఐ జి II, బ్లాక్ 8, ఫ్లాట్ 1, బాగలింగంపల్లి, హైదరాబాద్-44 చిరునామాలో సంప్రదించవచ్చు. ఫోన్: 040-27660173. ఇతర వివరాలు, దరఖాస్తు పత్రాల్ని ఆన్‌లైన్‌లో www.papulationfirst.org మరియు http://bhumika.org నుంచి కూడా పొందవచ్చు.

Monday, October 25, 2010

దివ్యమైన ప్రజ్ఞ... అంధులకు మాట్లాడే కర్ర

ఆదిలాబాద్‌కు చెందిన స్నేహితురాళ్ళు దివ్య, ప్రజ్ఞ కలసి తమ దివ్యమైన ప్రజ్ఞతో అంధులకు ఊతమిచ్చే మాట్లాడే చేతి కర్రను కనిపెట్టారు. 2005లో వీరు ఇక్కడి శిశుమందిర్‌లో 10వ తరగతి చదివే రోజుల్లోనే ఈ ఘనత సాధించారు. వీరికి ప్రేరణనిచ్చింది "ప్రేమించు" సినిమాలో అంధురాలిగా నటించిన లయ పాత్ర..

వీరి ఉపాధ్యాయురాలు ఉదయ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ కర్రను తయారు చేశారు. దీనికి "టాకింగ్ బ్లైండ్ స్టిక్" అనే పేరు పెట్టారు. ఈ కర్రను ఊతంగా ఉపయోగించే అంధులకు ఏదైనా అడ్డం వస్తే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో "ప్రమాదం పొంచి ఉంది...ఆగండి" అనే సందేశం వినిపిస్తుంది. ఈ కర్ర ఉపయోగించే అంధులు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ పేరు వినిపించేలా దీనిని తయారుచేశారు.

ఒక మెసేజ్ బాక్స్, వాయిస్ రికార్డర్, ప్లగ్‌లు, ఇయర్ ఫోన్లు, వైర్లు ఉపయోగించి తయారు చేసిన ఈ కర్రకు అయిన ఖర్చు కేవలం రూ.220 మాత్రమేనట. ఇందుకోసం సెల్ ఫోన్‌లో ఉపయోగించే టెక్నాలజీని ఉపయోగించామని దివ్య, ప్రజ్ఞ చెప్పారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే దీనికి మరిన్ని మార్పులు చేసి అందరికీ అందుబాటులో తెస్తామని చెప్పారు. అమ్మాయిలా మజాకా.

Wednesday, September 29, 2010

లక్ష్మికి రామానుగ్రహం

భద్రాచల రామాలయంలోని కళ్యాణకట్టలో కేశఖండన పని చేసే ఉద్యోగి కృష్ణ ఇదే ఆలయంలో సంగీత వాద్య కళాకారులకు శృతినందించే బాధ్యతలు కూడా నిర్వహించేవాడు. ఏమైందో ఏమో... మానసిక వైకల్యంతో తాగుబోతుగా మారి విధులకు ఎగనామం పెట్టే పరిస్థితి వచ్చింది.

భార్యకు ఏమైనా అయితే చాలా తేలిగ్గా వాళ్ళను వదిలించుకునే మగాళ్ళున్న రోజులివి. కానీ కృష్ణ భార్య లక్ష్మి మాత్రం భర్త ఎలా మారినా ఇల్లాలిగా, అమ్మగా కుటుంబాన్ని గుట్టుగా నడుపుకుంటూ వచ్చింది. ఒక దశలో అతను పూర్తిగా ఆలయానికి దూరమయ్యే రోజులొచ్చాయి. దాంతో ఆలయంలో ఇతని బాధ్యతల్ని (కేశఖండన, శృతి అందించడం) తానే స్వీకరించింది.

మూడేళ్ళ పాటు లక్ష్మి చిత్తశుద్ధిని గమనించిన ఆలయ అధికార్లు ఆమెను పూర్తిస్థాయిలో సంగీత కళాకారుల బృందంలో చేర్చారు. గడచిన శ్రీరామ నవమి ఉత్సవాల్లో సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకూ తన సంగీతంతో శ్రీరాముణ్ణి సేవించే భాగ్యం ఈమెకు కలిగింది.