Tuesday, August 31, 2010

కన్వర్ ఆయుధం... నెంబర్ 100

పదకొండు సంవత్సరాల ఆ బాలికకు ఆరోజు పెళ్ళి చూపులు. ఆమెకేమో చదువంటే మహా ప్రాణం. పెళ్ళివారు చూసుకోవడానికి వచ్చేశారు. వారికి ఇంట్లోవాళ్ళు రాచ మర్యాదలు చేస్తున్నారు. ఇక ఉండబట్టలేకపోయింది ఈ చిన్నారి. వెంటనే వారిముందుకు దూసుకెళ్ళి పెళ్ళి ఊసు ఎత్తారంటే నెంబర్ 100 (పోలీస్)కు ఫోన్ చేస్తానని అరిచింది. ఇక ఈ సంబంధం మాకొద్దు బాబోయ్ అంటూ మగపెళ్ళివారు వెనక్కి తిరగకుండా పరుగుతీశారు. వారిని పరుగుపెట్టించిన అమ్మాయి రాజస్థాన్‌లోని రాజ్‌పుట్ వర్గానికి చెందిన బాలిక కన్వర్ సోంధియా.

ఝలవార్ జిల్లా డాగ్ గ్రామంలో నివసించే కన్వర్ పని తమ ఇంట్లో పశువుల్ని మేతకు తీసుకెళ్ళడం, అందరూ తిన్న తర్వాత అంట్లు తోమడం. ఈమెకు ముగ్గురు అన్నలు, ముగ్గురు అక్కలు. అక్కలందరికీ పదేళ్ళ వయసుకే పెళ్ళిళ్ళు అయిపోయాయి. తర్వాత కన్వర్ వంతు. అన్నలంతా బడికి వెళుతుంటే ఆగలేక తననూ పంపించమని అమ్మానాన్నల్ని అడిగింది. ఇంట్లో పనెవరూ చేస్తారంటూ వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా పట్టువీడలేదీమె. ఇంటిపని అయ్యాకే బడికెళతానని చెప్పింది. పెద్దలు చివరికి ఒప్పుకుని పంపించినా రోజూ రుసరుసలే. ధైర్యం చేసిన కన్వర్ అక్కడి పోలీస్ అధికార్లను కూడా కలుసుకుంది. మీ పెద్దవాళ్ళు కొడితే 100కు ఫోన్ చెయ్యమని చెప్పారు. అదే ఈమె ఆయుధం. ఆ ఊరిలో ఒక స్వచ్ఛంద సంస్థవారు ఏర్పాటు చేసిన ప్రభాత్‌శాల బడిలో చదువుతున్న కన్వర్ తన పరిస్థితి గురించి తన ఉపాధ్యాయులకు వివరించింది. అలాంటి పరిస్థితుల్లోనే పైన చెప్పిన పెళ్ళి సంబంధం రావడం... నెంబర్ 100తో బెదిరించి వారిని సాగనండం అయ్యింది.

ఆ తర్వాత ధోరణి మార్చుకున్న ఈమె అమ్మానాన్నలు వెనక్కి తగ్గారు. కన్వర్ మంచి మాటలతో ఈమె తండ్రి మద్యం కూడా మానేశాడు. బాల్య వివాహంపై తిరగబడిన ఈ చిన్నారి గురించి తెలుసుకున్న అధికార్లు పైకి సిఫారసు చెయ్యడంతో 2008లో ఈమెకు జాతీయ సాహస బాలల పురస్కారం కూడా దక్కింది. రాష్ట్రప్రతి, ప్రధానమంత్రుల్ని కలుసుకునే అవకాశం వచ్చింది. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన "ప్రపంచ బాలల స్థితిగతుల నివేదిక - 2007" ఆవిష్కరణ, యునిసెఫ్ కార్యక్రమాల్లోనూ పాల్గొంది.

డాగ్ గ్రామ పరిసరాల్లో బాల్యవివాహాలు చేసేవారికి కన్వర్ పేరు తల్వార్‌లా వినిపిస్తుంది.

No comments:

Post a Comment