Sunday, December 12, 2010

ఆవిడ.. రసాయన కంపెనీలకు రాక్షసి

రాచెల్ లూయిస్ కార్సన్... ఈ పేరు వింటే పశువులు, పక్షులు పులకించిపోతాయి. చెట్లు చేమలు చెంగు చెంగున గెంతుతాయి. చెరువులు, కాల్వలు ఉప్పొంగిపోతాయి. కొండా కోనా పరవశంతో ప్రతిధ్వనిస్తాయి. నేస్తమా బాగున్నావా? ఆంటూ పల్లెలన్నీ కుశల ప్రశ్నలు వేస్తాయి. ఎందుకంటారా ? పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రపంచాన్ని ప్రేరేపించి ముందుకు నడిపించిన "సైలెంట్ స్ప్రింగ్" పుస్తకాన్ని రచించిన సుప్రసిద్ధ రచయిత్రి ఈమే కనుక.

రాచెల్ 1907 మే 27న పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఒక కుగ్రామంలో పుట్టారు. అలెగనీ నదీ తీరాన ప్రకృతి ఒడిలో పెరిగారు. పచ్చిక బయళ్ళు, అడవులు, పశుపక్ష్యాదులు ఆమెకు ప్రాణమై నిలిచాయి. పేదరికాన్ని జయించి ఉన్నత విద్య అభ్యసించారు. డాక్టరేట్ సాధించి అమెరికా సివిల్స్ పరీక్షల్లోనూ ఉత్తీర్ణురాలై మత్స్యశాఖలో చేరారు.

మెరైన్ బయాలజిస్ట్ అయిన రాచెల్ లూయిస్ కార్సన్ రాసిన "సైలెంట్ స్ప్రింగ్" (మౌనవసంతం) పుస్తకం విషయానికి వస్తే... రసాయన కంపెనీలు ఉత్పత్తి చేసే పురుగుల మందుల వల్ల పర్యావరణానికి, మానవాళికి ఎంతటి ప్రమాదం ముంచుకొస్తుందనేది దాని సారాంశం. రసాయన కంపెనీలు ఆమెను రాక్షసిగా అభివర్ణించాయి. అప్పటికే పురుగుల మందుల వినియోగంపై ఒక విధానాన్ని ప్రకటించిన అమెరికా ప్రభుత్వం వెనక్కి తగ్గి దానిని ఉపసంహరించుకుంది.

రాచెల్ పై కక్షగట్టిన రసాయన కంపెనీలు కోర్టుల్లో కేసులు వేశాయి. వాటన్నిటినీ జయించారు రాచెల్. రాచెల్ మాటలు వింటే దేశాలన్నీ అంధకారంలోకి వెళతాయని, ప్రపంచమంతా పురుగులమయం అవుతుందని రసాయన కంపెనీలు దుష్ప్రచారం చేశాయి. అయితే రాచెల్ పుస్తకంలోని వాస్తవాల్ని, ఆమె వాదనను అర్థం చేసుకున్న నాటి సభ్య సమాజంలోని మేధావులు, విద్యావంతులు ఆమె వెంట నిలిచి గెలిపించారు.

ప్రకృతి మాత సేవలో తరించిన రాచెల్ 1964, ఏప్రిల్ 14 మరణించారు. 2007లో వీరి శతజయంతి వేడుకలు జరిగాయి.