Saturday, February 27, 2010

చదువుకోసం ఆస్తి దానం

వరంగల్ జిల్లా మంగపేట మండలంలోని మారుమూల పల్లె నర్సాపురంలో పుట్టిన సరోజినికి చదువంటే పంచ ప్రాణాలు. తాను పుట్టింది రైతుకుటుంబం కావడం, నాటి ఆచారాలు అడ్డురావడంతో ఆ కోరిక తీరలేదు. పైగా తొమ్మిదేళ్ళకే పెళ్ళయిపోయింది. భర్త ఎక్కటి శేషారెడ్డి పరకాల మండలం ద్వారకపేటకు చెందినవారు. ఆయన సివిల్ ఇంజనీర్ కావడంతో 1969లో ఉద్యోగార్థం భర్తతో అమెరికాలో స్థిరపడ్డారు. ఎక్కడికెళ్ళినా సరోజినికి తాను చదువుకోలేదన్న బెంగ మాత్రం అలాగే ఉండిపోయింది. తన చిన్నతనంలో తనలాంటి ఆడపిల్లలు పడిన పాట్లు నేటి పిల్లలు పడకూడదని భావించారు. ఈ క్రమంలో అమెరికాలో "బేబీకేర్ సెంటర్" ప్రారంభించిన సరోజిని తాను ఆర్జించిన మొత్తంతో స్వంత ఊరికి ఏమైనా చెయ్యాలని సంకల్పించారు. భర్త తోడ్పాటుతో మంగపేటలో జూనియర్ కళాశాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. అదే సమయంలో భర్త మరణించడంతో వేదనకు గురైనా తన సంకల్పాన్ని వీడని సరోజిని తన ఆస్తి మొత్తాన్ని విద్యావ్యాప్తికే అంకితం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం 55.5 లక్షల విలువైన భూమిని, 26.5 లక్షల రూపాయల్ని కళాశాలకోసం ఇచ్చేశారు. ఇందుకు సంబంధించిన ఆస్తుల పత్రాల్ని 2007లో స్టేషన్ ఘన్‌పూర్ వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రికి స్వాధీనపరిచారు. భవిష్యత్తులో ఒక ఇంగ్లీష్ మీడియం పాఠశాల, వృద్ధాశ్రమం ఏర్పాటు తన లక్ష్యాల్లో ఉన్నాయని చెప్పిన మన సరోజిని చదువుల తల్లి సరస్వతికి నిజమైన బిడ్డ అనడంలో సందేహమేంటి...